వావ్, ట్రంప్ అడ్డంగా బుక్కయ్యాడా?

Trump was booked

04:06 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Trump was booked

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బిగ్ డిబేట్ లో జరిగిన చర్చలో భాగంగా హిల్లరీ క్లింటన్ లేవనెత్తిన అంశాలు, ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు హిల్లరీ ప్రైవేటు ఈ మెయిల్స్ విషయాలను ప్రచారానికి వాడుకున్న ట్రంప్ కు ఇప్పుడు చిక్కులు మొదలయ్యాయి. ఆయన 1995లో దాఖలు చేసిన ఆదాయపన్ను రిటర్న్స్ లో భారీగా నష్టాలు చూపించి పన్ను రాయితీలు పొందుతున్నారని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంటూ కథనం వెలువరించింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు 916 మిలియన్ డాలర్ల నష్టాన్ని చూపించారు.

దీంతో 18ఏళ్లలో నష్టాలను పూరించుకునేందుకు చట్ట పరంగా ఇచ్చిన మినహాయింపులను ఉపయోగించుకొని పన్ను ఎగ్గొట్టినట్లు పేర్కొంది. ఏటా సగటున 50 మిలియన్ డాలర్ల వరకు పన్ను ఎగవేసి ఉండొచ్చని తెలిపింది. ఇప్పటి వరకు 1995 పన్ను రికార్డులను ట్రంప్ బయటపెట్టలేదని ఈ పత్రిక తెలిపింది. మూడు కెసినోల్లో, ఎయిర్ లైన్స్ వ్యాపారంలో, మాన్ హట్టన్ లోని ప్లాజా హోటల్ లో ఈ నష్టాలు వచ్చినట్లు చెబుతున్నారు. ట్రంప్ వ్యవహార శైలి కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఆయన ఇంతవరకు పన్ను రికార్డులను బయటపెట్టలేదు. సాధారణంగా అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో నిలబడేవారు పారదర్శకతను పాటిస్తారు.

తన పన్ను రికార్డులు ప్రస్తుతం ఫెడరల్ ఆడిట్ పరిధిలో ఉండటంతో తాను బయటపెట్టలేనని ట్రంప్ చెబుతున్నారు. కొన్ని పత్రికలు ఉద్ధేశపూర్వకంగానే ట్రంప్ పన్ను రిటర్నులను అక్రమంగా బహిర్గతం చేస్తున్నాయని, ప్రజలను హిల్లరీ క్లింటన్ కు అనుకూలంగా మలిచేందుకు ఇలాంటి పనులకు ఒడిగడుతున్నాయని ట్రంప్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తానికి ఎన్నికల్లో ఈ అంశం పెద్ద ప్రభావం చూపుతుందన్న వార్తలు వస్తున్నాయి.

English summary

Trump was booked