సర్వత్రా ఖండన - ఒకరిపై ఒకరు విమర్శల జోరు

Tuni Incident Issue

01:43 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Tuni Incident Issue

కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్న కాపులు చేపట్టిన ఐక్య గర్జన హింసాత్మక ఘటనలకు దారితీయడం నేపధ్యంలో ఈ ఘటనను ఉద్యమ నేతలతో సహా అందరూ ఖండిస్తూనే, మరోపక్క ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మెగాస్టార్ , పవర్ స్టార్ లు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, సునిశిత విమర్శలు గుప్పించారు. ఇక అధికార విపక్షాల నడుమ విమర్శల యుద్ధం నడుస్తోంది. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మీద అధికార పక్షం దుమ్మెత్తి పోస్తుంటే , ముద్రగడ వర్గీయులు కూడా ప్రభుత్వ తీరుని ఎండగడుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో వి కొత్తూరు కొబ్బరి తోటలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సదస్సు సందర్భంగా ,'ఉద్యమం లో మా కుటుంబం ముందుంటుంది ఇప్పటి నుంచే రోడ్డు మీద , రైల్ పట్టాల మీద కూర్చుం దాం అంటూ సభా వేదిక నుంచి ముద్రగడ పిలుపునిస్తూ , నేరుగా రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. రైల్‌రోకో చేపట్టేందుకు తుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్న సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌పై ఆందోళన కారులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేసారు. నిప్పు పెట్టడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు. అంతటితో ఆగని విద్వంస కారులు తుని రూరల్ , అర్బన్ పోలీసు స్టేషన్లకు నిప్పు పెట్టారు. పోలీసులపై , మీడియా ప్రతినిధులపై కూడా దాడికి దిగారు. ఓ పక్క రైల్ రోకో , మరో పక్క రాస్తా రోకో సాగడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వల్ల కాలేదు. ఆరోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో కాపు రిజర్వేషన్లపై డేడ్ లైన్ విధిస్తూ , ఆందోళనను ముద్రగడ విరమించారు.

ఆ తర్వాత పెద్దయెత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డిల్లీ నుంచి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ , బలగాలు చేరుకున్నాయి. ప్రస్తుతం పోలీసు కంట్రోల్ లో వుంది . తూర్పు గోదావరిలో పలు ప్రాంతాల్లో సెక్షన్ 144 విదించారు. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఘటనా స్థలాలను పరిశీలించారు.

ఇది రౌడిల పనేనన్న సిఎమ్

సంఘటన జరిగిన రోజు రాత్రి అత్యవసరంగా సమీక్ష చేసిన సిఎమ్ చంద్రబాబు ఈ ఘటనపై కలత చెందారు. ఇది మామూలుగా కాపులు చేసిన పని కాదని , రౌడిల పనేనని , ట్రైనింగ్ ఇచ్చి మరీ విద్వంసం సృష్టించేలా చేసినట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. స్వార్థం కోసమే తూర్పుగోదావరి జిల్లా తునిలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనలో 25 వాహనాలు, రెండు పోలీస్‌స్టేషన్లు తగులబెట్టారని, సీఐ సహా 15మంది పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, పాత్రికేయులపైనా దాడులు చేశారని ఆయన పేర్కొంటూ , ప్రశాంతంగా వుండే గోదావరి తీరంలో తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టి స్వార్థం కోసం విధ్వంసం సృష్టించాయని ఆయన ఆరోపించారు. కాపుల అభ్యున్నతికి ఎంతో కృషిచేసున్నామని వివరించారు.

క్రిమినల్ అంటూ బాబుపై జగన్ ధ్వజం ...

రాజకీయలబ్ధి కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబే నని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ఆరోపించారు. చంద్రబాబు బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు అబద్దాలు చెప్పి అధికారంలోకొచ్చారని, ఇప్పుడు మోసం చేశారు కాబట్టే నిస్పృహలో లక్షలమంది కాపులు తునిలో ఉద్యమించారన్నారు. సమావేశం విజయవంతమైతే ఉద్యమకారులకు, ప్రతిపక్షాలకు మంచిపేరు వస్తుందని చంద్రబాబే కావాలని అలజడిని సృష్టించి, ఆ చెడ్డ పేరును ఉద్యమకారులకు ఆపాదించారని ఆరోపించారు. చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైకాపా, కాంగ్రెస్‌లే చేశాయని అభాండాలు వేస్తున్నారన్నారు. అబద్దాలు చెప్పి మోసం చేసిన ఆయన్ను ఒకటో నంబరు నేరగాడని ఎందుకు అనకూడదని ప్రశ్నించారు.

జగన్ దుర్మార్గు డంటూ బాబు కౌంటర్ ....

అయిదేళ్లు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తి కనీసం ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలో కూడా తెలియనంత హీనంగా మాట్లాడుతున్నారని, అటువంటి దుర్మార్గుడి ఉచ్చులో చిక్కుకోవద్దని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను చెడగొట్టి, ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరిగిపోతోందని బయటి ప్రపంచానికి భ్రమలు కల్పించి పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. రాజకీయ ముసుగులో ఏం చేసినా ప్రచారం వస్తుందన్న ఉద్దేశంతో అవినీతి డబ్బుతో రౌడీఇజం చేస్తామంటున్నారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో మేం చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. ఆ అంశంపై నిబద్ధతతో పని చేస్తున్నాం. ఆ సమస్య పరిష్కారానికి నిర్దిష్ట గడువుతో ముందుకెళ్తున్నాం. ఇలాంటి సమయంలో శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకొన్న వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పులివెందుల నుంచి రౌడీలను పంపి ఇష్టానుసారంగా లూటీలు చేస్తూఉంటే ప్రభుత్వం చూస్తూ వూరుకోదు. చట్టం తనపని తాను చేసుకెళ్తుంది. అయినా రిజర్వేషన్ల కోసం మేం చట్టబద్ధమైన ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఇలా చేయడమేంటి?’’ అని చంద్రబాబు నిలదీశారు.

పారదర్శకత లేని పాలన వల్లెనన్న చిరంజీవి ...

కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి పేర్కొంటూ, పారదర్శకత లేకుండా 20 మాసాలుగా రాష్ట్రంలో సాగుతున్న చంద్రబాబు పరిపాలనే ఈ సంఘటనలకు ప్రధాన కారణం గా విశ్లేషించారు. ఈ మేరకు సోమవారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ‘‘గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీ జాబితాలో చేరుస్తామని తెలియజేశారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున నిధులు కేటాయిస్తామన్నారు. అదే సమయంలో బీసీలకు అన్యాయం జరక్కుండా చూస్తామని చెప్పారు. ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. ఇక అమరావతి నిర్మాణంలోనూ పారదర్శకత లేదు. ఈ కారణాల వల్ల ప్రజల్లో నిరాశ, నిస్పృహలు, అశాంతి నెలకొన్నాయి. విభజించు పాలించు విధానంలో వివిధ వర్గాల మధ్య అపోహలు సృష్టించడం సమంజసం కాదు. కాపులను బీసీ జాబితాలో చేర్పించే విషయంలో రాజ్యాంగ ప్రక్రియకు భిన్నంగా వ్యవహరించడంతో పాటు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటుకు 18 నెలలు కాలయాపన చేశారు. రూ.2 వేల కోట్లు బదులు రూ.100 కోట్లు ఇచ్చి ఆర్థిక పరిస్థితి బాగాలేదనడం ఆశ్చర్యకరం.ఆలన్తప్పుడు ప్రత్యేక విమానాల్లో విదేశాలు ఎలా చుట్టి వస్తున్నారు. చిత్తశుద్ధి ఉండి ఉంటే కాపుల రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపే చొరవ చూపేవారు. లోపం మీ వద్ద ఉంచుకొని ఆ నెపాన్ని ఇతర పార్టీల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత వరకు సబబో ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇచ్చిన హామీలు నేరవేర్చడంలో చిత్తశుద్ధి చూపకపోతే, పరిపాలనలో పారదర్శకత లేకపోతే... కాపులు, బీసీలు, మహిళలే కాదు... చివరకు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన మీ పార్టీ సానుభూతిపరులు సైతం రోడ్లెక్కి ఉద్యమించే పరిస్థితి వస్తుంది' అంటూ ఆలేఖలో చిరంజీవి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ కుట్రలో భాగమన్న ముద్రగడ ...

శాంతియుత వాతావరణంలో సభ నిర్వహించాలనుకున్నామని.. రాస్తారోకో, రైల్‌రోకో హింసాయుతంగా మారడం దురదృష్టకరమని ముద్రగడ పద్మనాభం పేర్కొంటూ , కాపు ఐక్యగర్జన తేదీని ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం పలు ఆటంకాలు కలిగించిందని విమర్శించారు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ , రౌడీలను కాపు గర్జనకు పంపించారని, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగానే హింస చోటుచేసుకుందని ఆరోపించారు. రైల్‌రోకోకు తమవారు వెళ్లక ముందే అక్కడ కొందరు ఉన్నారని.. రైలుకు నిప్పంటించడం.. పోలీస్‌స్టేషన్‌, వాహనాలపై దాడి అంతా వారి పనేనని ఆరోపించారు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా హింసాయుత సంఘటనలు జరగడంతో వెంటనే ఉద్యమాన్ని ఆపేసినట్లు ముద్రగడ వివరించారు.

5న ఆమరణ దీక్షకు దిగుతానని వెల్లడి ....

ఈ నెల 5న ఉదయం 9 గంటల నుంచి సతీసమేతంగా ఇంట్లోనే ఆమరణదీక్ష చేపడుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు. ఒక వేళ తమను పోలీసులు అరెస్టు చేసినా జైల్లోనూ దీక్ష కొనసాగిస్తామన్నారు. దీక్ష సందర్భంగా కాపులెవరూ తన ఇంటికి రావద్దని సూచించారు. ఎవరి ఇళ్ల వద్ద వారే దీక్షలు చేసి నిరసన తెలపాలన్నారు. రిజర్వేషన్ల విషయం తేల్చే వరకు నిద్రపోనన్నారు. ఎవరూ ఆవేశానికి గురికావద్దని.. శాంతియుతంగా గాంధీ బాటలోనే ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం నాటి ఘటనలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై జరిగిన దాడులకు క్షమాపణ చెప్పారు. తమ వాటా రిజర్వేషన్‌ తమకు కేటాయించాలని.. ప్రస్తుతమున్న బీసీల కోటాలో తమకు వాటా వద్దని అన్నారు. తమ ఉద్యమానికి వైకాపా మద్దతు లేదని, తెదేపాలో ద్వితీయ శ్రేణి నేతలు.. కాంగ్రెస్‌, బిజెపి నేతలు తమకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘ఉద్యమానికి జగన్‌ మద్దతు ఉందని పదేపదే ఆరోపించడంపై ముద్రగడ స్పందిస్తూ, దీనిపై కాణిపాకం వినాయకుడి ముందు ప్రమాణం చేసి చెప్పగలరా?’’ అని టిడిపి నేతలకు సవాల్‌ విసిరారు.

అందరినీ తప్పుబట్టిన పవన్

ఇక కేరళ అడవిలో షూటింగ్ లో వున్న, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ హుటాహుటీన హైదరాబాద్ చేరుకొని, మీడియాతో మాట్లాడుతూ, 'రైలు ఒక అగ్గిపుల్ల గీయగానే కాలిపోయేది కాదు... తునిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల వెనుక సంఘ విద్రోహులు ఉన్నారు ' అని వ్యాఖ్యానించారు. రైలుని తగలబెట్టడం, అనంతరం జరిగిన పరిణామాలు పకడ్బందీ పథకం ప్రకారమే సాగినట్లు అనిపిస్తోందన్నారు. లక్షలమంది ఒక చోటుకి చేరుతుంటే పోలీసులు ఎందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసు బలగాల్ని తగినస్థాయిలో మోహరించలేదని ఆయన పేర్కొంటూ, అలా చేసి ఉంటే పరిస్థితి అదుపు తప్పేది కాదన్నారు. శాంతియుతంగా ఉంటేనే ఉద్యమం విజయవంతమవుతుం దని ఆయన పేర్కొంటూ, ఉద్యమానికి నేతృత్వం వహించేవాళ్లు హక్కులు సాధించుకోవాలే తప్ప భావోద్వేగాలు రెచ్చగొట్టడం సమంజసం కాదని స్పష్టం చేసారు. అలాగే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్తుందన్న నమ్మకం ప్రభుత్వం కల్పించలేక పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

ముద్రగడే కారణమన్న హొమ్ మంత్రి ...

కాపుజాతికి ముద్రగడ పద్మనాభం ఎప్పుడూ ఉపయోగపడక పోగా , మంత్రిగా వున్నసమయంలో కాపులు తన వద్దకు రావొద్దని బోర్డు పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదివారం తునిలో జరిగిన హింసాకాండకు ముద్రగడే పూర్తి బాధ్యత వహించాలన్నారు. బయటి నుంచి వచ్చిన వైస్సార్ పార్టీ గూండాలే హింసకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామన్న హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాన్ని అమలు చేసి తీరుతుందని స్పష్టంచేశారు. ముద్రగడ తాను ఒక్కడే నాయకుడిగా ఉండాలనుకుంటారని, కాపుల్లో మిగతా ఎవరికీ పదవులు రావడం ఆయనకు ఇష్టం ఉండదని ఆయన విమర్శించారు. వైస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి పది రోజుల ముందే వెళ్లి సభ ఏర్పాట్లు పర్యవేక్షించారని రాజప్ప ఆరోపించారు. అయితే టిడిపి యే ఇదంతా చేసిందంటూ అసత్యాలు ప్రచారం చేయవద్దని ముద్రగడను ఆయన హెచ్చరించారు.

కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్య

కాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని డైరీ ఫాం సెంటర్‌కు చెందిన చీకట్ల వెంకటరమణమూర్తి(50) అనే వ్యక్తి సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలియో వైకల్యంతో బాధపడుతున్న వెంకటరమణమూర్తి డీజిల్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనకు ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలెక్టరేట్‌ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కలెక్టరేట్‌ ఉద్యోగులు కలెక్టర్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలెక్టరేట్‌ ఆవరణలోని ఆంధ్రాబ్యాంకు భవనంపై నుంచి డీటీహెచ్‌ డిష్‌కు తాడు బిగించి దాని నుంచి సన్‌సైడ్‌ మీదుగా కిందకు దిగి ఉరివేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మృతుడి జేబులో నుంచి రెండు పేజీల లేఖ, ఒక సెల్‌ఫోన్‌, కొన్ని మందులను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్నారు. 'పేద వాళ్లకు అన్యాయం జరుగుతోంది, ఇకనైనా రిజర్వేషన్లు ఇవ్వండి అంటూ లేఖలో రాసి ఉందని, నేతలకు ఎన్నికల సమయంలోనే కాపులు గుర్తుకు వస్తారనే విషయాన్ని ఇందులో ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

వెంకట రమణ బౌతిక కాయాన్ని ముద్రగడ సందర్శించి , నివాళులర్పించారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు.

English summary

Various politicians respond on the Tuni incident.Nara Chandra babu naidu says that this was not the right thing and blames other political parties for that issue.Mudragada Padnabham says that he will do strike in his house