ఎయిర్ టెల్ -రిలయన్స్ జియో మధ్య వార్

War Between Reliance Jio And Airtel

02:22 PM ON 19th September, 2016 By Mirchi Vilas

War Between Reliance Jio And Airtel

టెలికం రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక ఫలాలు వినియోగదారులకు చేరువ చేయడానికి పోటీ పడుతున్న క్రమంలో వార్ కూడా సాగుతోంది. ముఖ్యంగా ఎయిర్ టెల్ -రిలయన్స్ జియో మధ్య నడుస్తున్న మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇస్తామన్న ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లు (పిఒఐ) కూడా ఇవ్వకుండా ఎయిర్ టెల్ మోసం చేసిందని రిలయన్స్ జియో ఆరోపించింది. దీంతో తమ నెట్ వర్క్ లో రోజూ రెండు కోట్లకు పైగా కాల్ డ్రాప్స్ నమోదవుతున్నట్టు పేర్కొంది. నంబర్ పోర్టబులిటీ కింద ఎయిర్ టెల్ నుంచి రిలయన్స్ జియో నెట్ వర్క్ కు మారే ఖాతాదారులనూ ఎయిర్ టెల్ ముప్పు తిప్పలు పెడుతోందని ఆరోపించింది.

వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే ట్రాయ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జియో ఒక ప్రకటనలో కోరింది. తమ రెండు నెట్ వర్క్ ల మధ్య కాల్స్ పూర్తయ్యేందుకు అవసరమైన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్స్ లో నాలుగో వంతు మాత్రమే ప్రస్తుతం ఎయిర్ టెల్ తమ నెట్ వర్క్ కోసం ఇచ్చిందని తెలిపింది. ఈ పాయింట్లతో ఖాతాదారులకు నాణ్యమైన ఉచిత వాయిస్ కాల్స్ అందించడం సమస్యగా మారిందని పేర్కొంది.

ప్రస్తుతం మార్కెట్ లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీని నీరుగార్చేలా ఎయిర్ టెల్ ప్రవర్తిస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. దీనివల్ల జియో ఖాతాదారులు ఉచితంగా నాణ్యమైన వాయిస్ సేవలు అందుకోవడం సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ టైమ్ కంటే ముందుగానే రిలయన్స్ జియో కోసం మరిన్ని పిఒఐలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించిన రెండో రోజే రిలయన్స్ జియో ఈ ఆరోపణలు గుప్పించడం గమనార్హం.

అయితే, ఎయిర్ టెల్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. జియో అవసరాల కంటే ఎక్కువ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లే ఇచ్చామని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 13నే అంతకు ముందున్న పాయింట్ల కంటే మూడింతలు పెంచినట్టు గుర్తు చేసింది. పెంచిన ఈ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లతో రిలయన్స్ జియో 1.5 కోట్ల కంటే ఎక్కువ మంది ఖాతాదారులకు కాల్ డ్రాప్స్ లేకుండా వాయిస్ సేవలు అందించ వచ్చని తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ జియోకు ఉన్న 10 కోట్ల ఖాతాదారుల అవసరాల కంటే ఇవి ఎక్కువేనని గుర్తు చేసింది. ఈ విషయాలేవీ గమనించకుండా రిలయన్స్ అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించింది. జియో టెక్నాలజీలోనే లోపం ఉండవచ్చని సంశయం వ్యక్తం చేసింది.

బహుశా వోల్ట్ టెక్నాలజీకి సంబంధించిన యంత్రాంగం ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడక పోవడం కూడా ఇందుకు కారణం కావచ్చని తెలిపింది. ఈ విషయాలను కప్పిపెట్టుకునేందుకే రిలయన్స్ జియో తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఎయిర్ టెల్ వ్యాఖ్యానించింది. మొత్తానికి ఈ వార్ ఎలా ముగుస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

ఇవి కూడా చదవండి:జయప్రదను చూసి లొట్టలేసుకున్న కలెక్షన్ కింగ్

English summary

Reliance Jio network was landed successfully and Jio network has attracted many people around India and now its time to war between Jio and Airtel Networks. Jio said that due to Airtel their customers have been faced problem with 2 crores call drops per day. This was opposed by Airtel and said that there was some internal problems in Jio network.