శల్య సారధ్యం అంటే ఏమిటో తెలుసా

Why We Use Salya Saradhyam Word

10:48 AM ON 7th January, 2017 By Mirchi Vilas

Why We Use Salya Saradhyam Word

చాలామంది చాలా సందర్భాల్లో ఈ పదం వాడుతూ వుంటారు. ముఖ్యంగా ఏదన్నా బాధ్యతను నమ్మి ఒకరి చేతికి అప్పగించినప్పుడు, వారు దానిని చేజేతులారా చెడగొట్టడాన్ని శల్య సారథ్యం అంటాం. ఇంతకీ ఈ సామెత ఎలా వచ్చిందంటే, మహాభారతంలో శల్యుని పాత్ర వలన. ఇంతకీ ఈ శల్యుడు ఎవరు, అతడు ఏమి చేసాడో ఓసారి చూద్దాం.

మహాభారత కాలంలో మద్ర రాజ్యానికి వారసుడు శల్యుడు. అతని సోదరి పేరు మాద్రి. ఈ మాద్రి ఎవరో కాదు! పాండురాజుకు రెండో భార్య. అంటే మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు శల్యుడు మేనమామ అవుతాడన్నమాట. శల్యునికి వారసత్వంగా మద్ర రాజ్యం వచ్చిన మాట నిజమే అయినా, ఆ రాజ్యాన్ని కాచుకోగల పరాక్రమం అతని సొత్తు. అస్త్ర విద్యలోనూ, గదాయుద్ధంలోనూ, రథాన్ని తోలడంలోనూ శల్యుని ప్రతిభ అంతా ఇంతా కాదు. అలాంటి శల్యుడు కనుక పాండవుల పక్షాన నిలిస్తే ఇక తమ పని ఖాళీ అని గ్రహిస్తాడు దుర్యోధనుడు. అందుకని ఎలాగైనా శల్యుని తమ గూటికి చేర్చుకునేందుకు పన్నాగాలను యోచిస్తాడు.

పాండవులు శల్యునికి స్వయానా సోదరి కొడుకులు కాబట్టి, వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు శల్యుడు ఒప్పుకోడని దుర్యోధనునికి తెలుసు. అందుకే శల్యుని తన వలలో వేసుకునేందుకు ఓ నాటకమాడతాడు. పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తరువాత వారిని పలకరించేందుకు శల్యుడు బయల్దేరతాడు. కానీ ఆ మధ్యలోనే శల్యునికి అంగరంగవైభవమైన గుడారాలు కనిపిస్తాయి. బహుశా అవన్నీ పాండవులవే కాబోసు అనుకుంటూ వాటిలోకి ప్రవేశిస్తాడు శల్యుడు. ఆ గుడారాలలోకి శల్యుడు ప్రవేశించగానే అతనికి సేవకులు సాదరంగా స్వాగతం పలుకుతారు. అద్భుతమైన విందుని ఏర్పాటు చేస్తారు. ఇదంతా పాండవులే తనకోసం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అనుకుని శల్యుడు మురిసిపోతాడు. విందు ముగిసిన వెంటనే తన వద్ద ఉన్న సేవకుని పిలిచి, ‘తక్షణమే వెళ్లి మీ స్వామిని పిలుచుకు రా! రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతుని ఆయనకు తెలుపుతా’ అంటూ ఆజ్ఞని జారీ చేశాడు.

శిబిరంలోకి సేవకునితో పాటుగా దుర్యోధనుడు రావడం చూసి శల్యుడు కంగుతింటాడు. కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. అన్న మాటను వెనక్కి తీసుకోవడం రాజధర్మం కాదు. అందుకని ఇక కౌరవుల పక్షానే తన సర్వసైన్యాలనూ నిలిపేందుకు శల్యుడు నిశ్చయించుకుంటాడు. అయితే శల్యుని కథ ఇక్కడే ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. కౌరవుల శిబిరం నుంచి శల్యుడు హుటాహుటిన బయల్దేరి పాండవులను కలుసుకుంటాడు. దుర్యోధనుడు తనను ఏరకంగా మభ్య పెట్టాడో చెప్పుకు వస్తాడు. కానీ ఆ సమయంలో శల్యుని చూస్తూ నిల్చొన్న ధర్మరాజుకి ఏదో ఉపాయం స్ఫురిస్తుంది. నిదానంగా శల్యుని పక్కకు తీసుకువెళ్లి ‘జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వారి పక్షాన యుద్ధం చేసినా కూడా మాకు ఒక సాయం చేస్తానని మాట ఇస్తావా?’ అని అడుగుతాడు ధర్మరాజు. దానికి శల్యుడు సంతోషంగా సరేనంటాడు.

‘నువ్వు రథాన్ని అద్భుతంగా తోలగలవు కాబట్టి, బహుశా ఏదో ఒక రోజున నీకు కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను అప్పగిస్తారు. ఆ సమయంలో నువ్వు అతడిని అడుగడుగునా అవహేళన చేస్తూ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి. నీ మాటలతో అతను మానసికంగా కుంగిపోవాలి' అని చెప్పడంతో శల్యుడు అలాగే అంటూ మాట ఇస్తాడు.

ధర్మరాజు ఊహించినట్లుగానే కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి దుర్యోధనుడు అప్పగిస్తాడు . అదే అదనుకోసం ఎదురుచూస్తున్న శల్యుడు అడుగడుగునా అతడిని సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తూ, పాండవును వేనోళ్ల పొగుడుతూ... కర్ణుని కృంగదీస్తాడు. కానీ కర్ణుని పరాక్రమాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్న శల్యునికి అతనిపట్ల ఆరాధన పెరిగిపోతుంటుంది. అందుకనే ఒకానొక సమయంలో కర్ణుడు విడిచే అస్త్రాన్ని అర్జునుని తల మీదకు కాకుండా ఛాతీ మీదకు గురిపెట్టమని సూచిస్తాడు. కానీ అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడిపోయిన కర్ణుడు, అతని మాటను పట్టించుకోక అమూల్యమైన అవకాశాన్ని కాస్తా చేజార్చుకుంటాడు. కృష్ణుడు రథాన్ని తొక్కిపెట్టడంతో ఆ అస్త్రం కాస్తా అర్జునుని కిరీటం మీదుగా వెళ్లిపోతుంది. కాలం గడిచేకొద్దీ కర్ణుని పట్ల ఉన్న శాపాలు ఒక్కొక్కటిగా ఫలించడంతో... అర్జునుని చేత అతనికి మరణం సంభవిస్తుంది. అలా కర్ణుని చావుకి ఉన్న వంద కారణాలలో శల్య సారధ్యం కూడా ఒకటిగా మిగిలిపోతుంది.

కర్ణుని మరణం తరువాత కౌరవ సైన్యం చిన్నబోతుంది. మర్నాడు యుద్ధాన్ని నడిపించగల యోధుడు ఎవ్వరా అని ఆలోచించిన దుర్యోధనునికి శల్యుడే గుర్తుకువచ్చాడు. అలా 18వ రోజున కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవసేనకు శల్యుడు నాయకత్వం వహించాడు. ఆ ఘట్టాన్ని శల్యపర్వం అంటారు. కర్ణుని విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి శల్యుడు అతడి ఓటమికి కారణం అయ్యాడే కానీ, యుద్ధంలో అతని పరాక్రమానికి వచ్చిన లోటేమీ లేదు. కురుక్షేత్ర యుద్ధం మొదలైన తొలిరోజునే అతను ఉత్తరకుమారుని సంహరించేశాడు. ఇక ఇప్పుడు సేనాపతి బాధ్యతని వహించిన తరువాత అతడి పటిమను అడ్డుకోవడం ఎవరి తరమూ కాలేకపోయింది. నకులుడు, సహదేవుడు, సాత్యకి... ఇలా పలువురు యోధులు ఒక్కసారిగా మీద పడుతున్నా, వారిని చిత్తుచేసి పారేస్తున్నాడు శల్యుడు.

దానికి కారణం లేకపోలేదు.శల్యునికి ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తారో... వారి మనసులో ఎంతటి క్రోధం ప్రబలుతూ ఉంటే, శల్యునికి అంతగా బలం చేకూరుతుందట. సాధారణంగా యుద్ధం చేసేవారు ఎవ్వరైనా కోపంతోనే కదా కలియబడేది. శల్యునికి ఉన్న ఈ బలాన్ని ఎరిగిన కృష్ణుడు, అతన్ని సంహరించే అవకాశం ధర్మరాజుకే ఉందని ఏనాడో చెప్పాడు. ఎందుకంటే ధర్మరాజు పరమ శాంత స్వభావి. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాననే భావనతో తప్ప, ఎదుటివాడిని చంపాలన్న కాంక్షతో యుద్ధం చేసే నైజం కాదు అతనిది. కాబట్టి శల్యుని సంహరించే బాధ్యతను స్వయంగా ధర్మరాజే తీసుకుంటాడు. అలా ధర్మరాజుకీ, శల్యునికీ మధ్య జరిగిన పోరులో అనేకసార్లు శల్యునిదే పైచేయి అయినప్పటికీ చివరకు ధర్మరాజు వదిలిన ఒక శూలంతో శల్యుడు నేలకూలక తప్పలేదు. అలా భారతంలో శల్యుని కథ ముగుస్తుంది.

శల్యుని కథ రెండు అపురూపమైన విషయాలను బోధిస్తాయి. ఒకటి- మానసికంగా కృంగిపోతే ఎంతటి వీరుడైనా ఓటమి పాలుగాక తప్పదు (శల్య సారథ్యం). రెండు- మన మనసులోని క్రోధం అవతలి మనిషికి బలంగా మారుతుంది (శల్యుని వరం)

ఇవి కూడా చదవండి: ధోనీ కెప్టెన్సీని వదులుకోవడానికి అసలు కారణాలు ఇవేనట

ఇవి కూడా చదవండి: కొల్హాపూర్ లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం విశిష్టత ఏమిటో తెలుసా

English summary

Mahabharata was one of the epic and hindu's treat it as the history of god and in that so many chapters were there and there was also Salya chapter in that and here is the reason why we call Salya Saradhyam word in our dialy life.